Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పిల్లలకూ ఇంటర్నెట్‌ ప్రాథమిక హక్కు.. పూర్తిగా దూరం చేయలేరు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court says internet is a fundamental right for children and cannot be denied
Advertisement
  • పిల్లలకూ ఇంటర్నెట్‌ వినియోగ హక్కు ఉందని సుప్రీంకోర్టు స్పష్టీకరణ
  • ఆర్టికల్‌ 21, 19(1)(a) కింద ప్రాథమిక హక్కుల రక్షణ ఉంటుందని వ్యాఖ్య
  • పిల్లలను ఇంటర్నెట్‌కు పూర్తిగా దూరం చేయడాన్ని వ్యతిరేకించిన ధర్మాసనం
  • తల్లిదండ్రుల పర్యవేక్షణ, చైల్డ్‌ మోడ్‌ వంటి భద్రతా చర్యలకు సూచన
  • పిల్లల ఖాతాలను ప్రైవేట్‌గా ఉంచే అవకాశాన్ని ప్రస్తావించిన కోర్టు
Advertisement
పిల్లలకు ఇంటర్నెట్‌ అందుబాటును పూర్తిగా నిరాకరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇంటర్నెట్‌ను వినియోగించుకునే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21, ఆర్టికల్‌ 19(1)(a) కింద ప్రాథమిక హక్కులతో ముడిపడి ఉందని పేర్కొంది. పిల్లల భద్రత పేరుతో వారిని పూర్తిగా ఇంటర్నెట్‌కు దూరం చేయడం సరికాదని తెలిపింది. పిల్లల రక్షణకు, వారి స్వేచ్ఛకు మధ్య వైరుధ్యం లేదని, రెండింటినీ కాపాడాల్సిన బాధ్యత ఉందని జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ కే వినోద్‌ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

సోషల్‌ మీడియా వేదికలు, ఇతర ఆన్‌లైన్‌ సేవల్లో పిల్లలపై లైంగిక దోపిడీ, వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ను గుర్తించి తొలగించే వ్యవస్థలను బలోపేతం చేయాలని ఆదేశాలు జారీ చేసే క్రమంలో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇంటర్నెట్‌లో భావప్రకటనా స్వేచ్ఛతో పాటు సమాచారాన్ని తెలుసుకునే, పొందే, ఇతరులతో పంచుకునే హక్కు కూడా ఇమిడి ఉందని వివరించింది. ఇంటర్నెట్‌ అనేది ఆలోచనలు, సృజనాత్మకత, సమాచార మార్పిడికి వేదిక అని పేర్కొంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని పిల్లలకు విద్య, సమాచారాన్ని పొందేందుకు ఇంటర్నెట్‌ ఒక్కటే ప్రధాన మార్గంగా ఉంటోందని తెలిపింది. ప్రత్యేక అవసరాలున్న పిల్లలు ఇతరులతో పరిచయాలు పెంచుకోవడానికి, తమలాంటి పరిస్థితుల్లో ఉన్నవారితో అనుసంధానం కావడానికి కూడా ఆన్‌లైన్‌ వేదికలు ఉపయోగపడతాయని వివరించింది.

ప్రస్తుతం ఇంటర్నెట్‌ పిల్లలకు పూర్తిగా సురక్షితమైన వేదిక కాదని అంగీకరించిన కోర్టు.. ఆ కారణంతో వారిని పూర్తిగా దూరం పెట్టడం పరిష్కారం కాదని స్పష్టం చేసింది. పిల్లలు ఇంటర్నెట్‌ వాడకూడదని నిబంధనలు విధించినంత మాత్రాన వారు దాని వినియోగాన్ని ఆపరని, నియంత్రణ లేని వెబ్‌సైట్లు, వేదికలకు వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఆన్‌లైన్‌లో ప్రలోభాలకు గురైన, బెదిరింపులు ఎదుర్కొంటున్న లేదా వేధింపులకు గురైన పిల్లలు ఇంటర్నెట్‌ వాడినందుకు తల్లిదండ్రులు మందలిస్తారనే భయంతో జరిగిన విషయాన్ని చెప్పకుండా ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లల ఇంటర్నెట్‌ వినియోగంపై సంపూర్ణ నిషేధం విధించడం తగిన చర్య కాదని పేర్కొంది.

పిల్లల వయసుకు తగిన భద్రతా చర్యలను కోర్టు వ్యతిరేకించలేదు. తల్లిదండ్రుల అనుమతి, మార్గదర్శకత్వం, పర్యవేక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. పిల్లల ఖాతాలకు ప్రత్యేకంగా ‘చైల్డ్‌ మోడ్‌’ తీసుకురావడం, ఖాతాలను ముందుగానే ప్రైవేట్‌గా ఉంచడం, తెలియని పెద్దల నుంచి వచ్చే సందేశాలు, పరిచయాలను పరిమితం చేయడం, పిల్లలకు చూపించే ప్రకటనలు, కంటెంట్‌పై నియంత్రణ విధించడం వంటి చర్యలను ప్రస్తావించింది. వీటి అమలుపై తగిన విధానాలను రూపొందించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వానికి వదిలేసింది. పిల్లలకు హానికరమైన అడల్ట్‌ కంటెంట్‌ వెబ్‌సైట్ల వంటి నిర్దిష్ట సేవలపై ఆంక్షలు విధించేందుకు ఈ వ్యాఖ్యలు అడ్డంకి కాదని స్పష్టం చేసింది.

ఇదే సమయంలో ఆన్‌లైన్‌ వేదికల్లో పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్‌ను గుర్తించి తొలగించేందుకు సమగ్ర జాతీయ డేటాబేస్‌ ఏర్పాటు సహా చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Advertisement
Advertisement
Supreme Court of India
Children Internet Rights
Fundamental Rights India
Online Safety for Kids
Article 21 Internet Access
Child Sexual Abuse Material

More Telugu News